ప్రకటన గ్రంథ రహస్యములు

By Sekhar Reddy Vasa

ప్రకటన గ్రంథ రహస్యములు - Sekhar Reddy Vasa
  • Release Date: 2017-07-15
  • Genre: Bible Studies

Description

ప్రియపాఠకులారా! దేవుడు ఆదామును సృజించి వానిని ఏదెను వనమునకు కాపలాగా ఉంచి, వాని ప్రక్కటెముక నుండి స్త్రీని సృజించాడు. మానవ పతనమునకు సంబంధించిన వృక్షఫలము ఒకటి ఆ వనములో ఉన్నదని ఆదామునకు తెలియకపోయినను, ఆ వృక్షఫలము తినుట ద్వారా మానవుని పతనము ఖచ్చితముగా జరుగునని దేవుడే స్వయముగా ఆదాముకు తెలియజేశాడు. కాని ఆదాము హవ్వలు ఇద్దరును సర్పముయొక్క బోధలకు లోనై దేవుడు తినవద్దన్న పండును తిని మరణము మరియు దేవుని శాపములు పొందారు. అటుతరువాత నోవహు కాలములో దేవుడు నోవహు అతని కుటుంబాన్ని ఎన్నుకొని నూట ఇరువది సంవత్సరములు ఒక ఓడను నిర్మించేశాడు. ఈ కాలములో దేవుడు నోవహు ద్వారా జలప్రళయము వలన జరుగు లోకనాశనాన్నిగూర్చి తెలియజేశాడు. కాని భూజనులు మారలేదు. దానికి ఫలితము మహాజలప్రళయము. అటుతరువాత మోషే కాలములో దేవుడు ఇశ్రాయేలీయులను దాస్యము నుండి విడిపింపదలచి వారికి నాయకుడిని ఎన్నుకొన్నాడు. మోషే ద్వారా ఐగుప్తులో జరుగు వినాశనమునుగూర్చి ఫరో రాజునకు అతని సంస్థానమునకు తెలియజేశాడు. కాని ఫలితము మాత్రము నాశనమే. అయినా దేవుడు వారికి ముందుగానే వారియొక్క నాశనమును తెలియజేసారు. ఇలా దేవుడు ముందుగానే వారి వారి నాశనమును గూర్చి ప్రవక్తల ద్వారా తెలియజేస్తూ వచ్చారు. ఎందుకంటే, వారు మారుమనస్సు పొంది రక్షణలోకి వస్తారని దేవునియొక్క ఆశ. ఈ విధముగా మారుమనస్సు పొంది తమ తప్పులను వీడినవారు నీనెవె పట్టణస్థులు. వారు యోనా యొక్క బోధ ద్వారా తమ తప్పును తెలుసుకొని మారుమనస్సు పొంది దేవుని రక్షణను పొందిరి. ఈ విధముగా దేవుడు జరిగించు వినాశనమునుగూర్చి ముందుగానే తానెన్నుకొన్న వారి ద్వారా తెలియజేసి, వారు మారుమనస్సు పాపపశ్చాత్తాపము పొందనట్లయితే వారిని నాశనము చేస్తూ వచ్చారు. కాని అంత్యకాలములో అనగా క్రీస్తు రెండవ రాకడలో జరగబోవు విషయాలను క్రీస్తు ప్రభువు మరణపునరుత్థానము తరువాత యోహానునకు దర్శనమిచ్చి వాని ద్వారా సమస్త లోకానికి జరుగబోవు సంగతులను తెలియజేసారు. ఇది జరిగి రెండువేల సంవత్సరాలై ఉండవచ్చును. ఆ కాలమునుండి యుగాంతములో జరుగబోవు విషయములు తెలుసుకొని మారుమనస్సు పొందినవారు రక్షింపబడుచు వచ్చారు. అయితే పొందనివారికి శిక్ష ఇంకా రాలేదు. అయితే ప్రకటన గ్రంథము మర్మములతో కూడినది. ఇది సాధారణమైనవారికి అర్థము కాదు అన్నది చాలామంది అభిప్రాయము. అయితే ఈ అంత్య దినములో అనగా లోకనాశనము దగ్గర పడుచున్న దినములో అందరికి అర్థమగు రీతిలో లోకాంత్యము జరుగుటకు కారణములు, ఎలా జరుగుతుంది? అన్న విషయములనుగూర్చి ఈ పుస్తకము ద్వారా అందరికి తెలియజేయుటకు మమ్ములను ఎన్నుకొని మా ద్వారా ఈ పుస్తక కార్యక్రమము జరిగించి, దీనిని ప్రతి ఒక్కరు చదువుకొని మారుమనస్సు పొందమని దేవుని హెచ్చరికయైయున్నది. లేనియెడల నాశనము తప్పదని దేవుని హెచ్చరిక. తన రాకడ యొక్క మర్మములు ప్రతి ఒక్కరు తెలుసుకొనవలెనని దేవుని కోరిక, ఎందుకంటే దేవుడు రహస్యముగా జరిగించువాడు కాదు. తన ప్రవక్తల చేత ముందుగానే తెలియజేసి, కొంత సమయము ఇచ్చి, అప్పటికి మారుమనస్సు పొందనివారిని నాశనము చేయును. అందులో భాగముగా మమ్ములను ఎన్నుకొని మాకు దైవజ్ఞానమును దయజేసి లోకనాశనము జరుగు విధానమును, దాని ఫలితమును ప్రతి ఒక్కరు సులభముగా అర్థము చేసుకొనునట్లు వ్రాయుటకు ప్రేరేపించి, ఈ పుస్తకము ద్వారా సమస్త భూజనులకు ఒక హెచ్చరికను దయజేయుచున్నాడు. ప్రియపాఠకులారా! ఈ హెచ్చరిక సాధారణమైనది కాదు. ఇది దేవునియొక్క నిర్ణయము. ఇప్పుడు ఇంకా కొంత సమయము ఈ పుస్తకము ద్వారా భూజనులకు ఇచ్చియున్నారు. ఈ పుస్తకమును చదివి మారుమనస్సు పొందమని కొంత సమయమును గూర్చి కూడ ఈ పుస్తకములో తెలియజేసియున్నారు. కనుక మారుమనస్సు పొంది దేవునికి యోగ్యమైన రీతిలో జీవించమని తండ్రి - కుమార - పరిశుద్ధాత్మల యొక్క దూతగా మిమ్ములను ఆదేశించుచున్నాను. లేనియెడల నాశనము తప్పదు, తప్పదు, తప్పదు. ప్రభువు యొక్క కృప ఆయన దాసులకు తోడైయుండును గాక! ఆమేన్‌.