దేవుని దూతలు - వారి పరిచర్యలు

By Sekhar Reddy Vasa

దేవుని దూతలు - వారి పరిచర్యలు - Sekhar Reddy Vasa
  • Release Date: 2017-07-17
  • Genre: Bibles

Description

ప్రియపాఠకులారా! ఈ లోకరీత్యా ఒక రాజు ఉన్నాడని అనుకొందము. అతనికి పరిచర్య చేయుటకు అన్ని విషయాలలో సేవకులు ఉంటారు. అనగా యుద్ధ కాలాలలో తన పక్షముగా పోరాడే సైనికులు, ఖైదీలను తన ఆజ్ఞ ప్రకారము కాపలా కాయువారు, ఇలా మనము చెప్పుకుంటూపోతే రాజుకు రాజ్యములోని ప్రతి ఒక్కరు పరిచారకులే, ఎందుకంటే రాజు చెప్పినదే శాసనము. ఉదా :- దానియేలు 3:1-6, ''రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమయొకటి చేయించి, బబులోనుదేశములోని దూరాయను మైదానములో దాని నిలువబెట్టించెను. అది అరువదిమూరల ఎత్తును ఆరుమూరల వెడల్పునై యుండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్రవిధాయకులను న్యాయాధి పతులను సంస్థానములలో ఆధిక్యము వహించినవారినందరిని సమకూర్చుటకును, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయొక్క ప్రతిష్ఠకు రప్పించుటకును దూతలను పంపించగా ఆ యధిపతులును సేనాధిపతులును సంస్థానాధిపతులును మంత్రులును ఖజానాదారులును ధర్మశాస్త్రవిధాయకులును న్యాయాధిపతులును సంస్థానములలో ఆధిక్యము వహించినవారందరును రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయొక్క ప్రతిష్ఠకు కూడివచ్చి, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయెదుట నిలుచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా-జనులారా, దేశస్థులారా, ఆ యా భాషలు మాటలాడువారలారా, మీకాజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా పిల్లంగ్రోవి పెద్దవీణె సుంఫోనీయ వీణె విపంచిక సకలవిధములగు వాద్యధ్వనులు మీకు వినబడునప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమయెదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపనివాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును.'' ఇందులో రాజు శాసించుట ఆయన రాజ్యములో ఉన్న ప్రతి ఒక్కరు పాటించుట చేసారు. ఇలా ఆజ్ఞలను పాటించువారు పరిచారకులు అని చెప్పవచ్చును. అలాగే ఈ సృష్టికి మూలము దేవుడు. ఈయన రాజ్యము పరలోకము. ఈ రాజ్యములో అద్వితీయ మహాదేవుడు తన సింహాసనముపై అధిష్టించి తన రాజ్యమైన ఏడు లోకాలను ఏలుచున్నాడు. 1 రాజులు 22:19, ''మీకాయా ఇట్లనెను-యెహోవా సెలవిచ్చినమాట ఆలకించుము; యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోకసైన్య మంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట నేను చూచితిని.'' ఇటువంటి దేవాదిదేవుని పరిపాలనలో వివిధ రకాల దూతలు, జీవాత్మయైన నరులు, జంతువులు, పక్షులు, చెట్లు, జలచరములు మొదలైనవన్ని నివసిస్తున్నాయి. ఇవే కాకుండ జీవాత్మ ఈ భౌతిక శరీరమును విడిచిన తరువాత ఆత్మలు నివసించే లోకాలు కూడ ఈ దేవుని ఆధీనములో ఉన్నవే. అంటే మృతులు ఉండే మృతుల లోకము, ఈ భూలోకము, పౌలు దర్శనములో చూచిన మూడవ ఆకాశములోని లోకము, తీర్పు జరుగు మధ్యాకాశము అనగా మూడవ లోకము, అలాగే రహస్య స్థితిలో ఉన్న నాలుగు, ఐదు, ఆరు లోకాలు, అటుతరువాత ఉన్న అనంతమైన పరలోకము, వీటన్నిటికిని పైగా మహాకాశాలు అందులో 1 తిమోతి 6:16లో చెప్పబడినట్లు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము కలిగి నివసించును. వీటన్నిటికి రాజాధిరాజు తండ్రియైన దేవుడు. ఈయన రాజ్యములో ఉన్నవారందరు ఈయన యొక్క ఆజ్ఞల ప్రకారముగా జీవించవలసి యున్నది. ఈనాడు మనము రకరకాల నరులు ఈ లోకములో జీవిస్తూ వివిధ రకాల వృత్తులు చేస్తూ ఉన్నారు. వీరిలో వారి వారి ఆకారము వృత్తులు, జీవన విధానమును బట్టి వారు కొన్ని ప్రాంతములను ఎన్నుకొని జీవిస్తున్నారు. వారి వారి ప్రాంతములను వారి సంబంధమైన రాజులు పరిపాలించుచున్నారు. ఇలా ఈ లోకములో కొన్ని వందలమంది రాజులు ఏకకాలము పరిపాలించుచున్నారు. వీరిలో సామంత రాజులు కూడ అనగా ఇంకో రాజు క్రింద పని చేయువారు ఉన్నారు. ఈనాడు రాజుల స్థానములో పేరు మార్పు చెంది మంత్రులుగా చలామణీ అగుచున్నారు. అలాగే పరలోక రాజ్యములో రాజు తండ్రియైన దేవుడు. అయితే ఆయన దూతలు రకరకాల స్థితులలో అధికారులుగా ఉన్నారు. ఈ దూతలలో వెట్టిచాకిరి చేయువారు ఉన్నారు, ఖైదీలు ఉన్నారు, తిరుగుబాటు దారులు ఉన్నారు. అయితే వీరి జీవిత విధానము నరులపై ఎక్కువ ప్రభావము చూపునని మనము గ్రహించాలి. నరుల ఉన్నత స్థితి, పతనమునకు రెండింటికిని కారకులు వీరు. మనకు తెలియకుండానే మన చుట్టూ అనేక విధములైన కార్యములు జరిగిస్తూ మనకన్నా ముందుగా ఆ కార్యములు నెరవేర్పు జరిగిస్తున్నారు. ఏడు లోకాలకు అధిపతియైన పరలోక రాజ్యాధిపతి తండ్రియైన దేవుడు యెహోవా అను నామధారి పరిపాలనలో అనేక రకములైనవారు నివసిస్తుండగా ఈ పుస్తకము ద్వారా మనము దేవుని దూతలను వారు చేయు కార్యములను గూర్చి సంపూర్ణముగా తెలుసుకొందము.