జెకర్యాకు యెహోవా వాక్‌ దర్శనములు పరమార్థములు

By Sekhar Reddy Vasa

జెకర్యాకు యెహోవా వాక్‌ దర్శనములు పరమార్థములు - Sekhar Reddy Vasa
  • Release Date: 2017-07-22
  • Genre: Bible Studies

Description

జెకర్యా ఒక ప్రవక్త :- జెకర్యా 1:1, ''దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా'' ఈ విధముగా జెకర్యాకు యెహోవా వాక్కు ప్రత్యక్షము కాగా జెకర్యాకు ప్రవక్తగా ఒక స్థానము లభించింది. దేవుని ప్రత్యక్షత లేనివారు ప్రవక్తగా ఎన్నిక కాలేరు. కనుక జెకర్యా ఒక గొప్ప ప్రవక్తగా దేవునిచే ఎన్నిక కాబడి బైబిలు గ్రంథములో అతని పేరు మీద ఒక పుస్తకము లిఖించబడియున్నది. కాని ఈ జెకర్యా ఎవరు? ఎందుకు దేవుడు ఆయనను ఎన్నిక చేసాడు? ఎందు నిమిత్తము ఈ ప్రత్యక్షతలు అనుగ్రహించబడినవి? ఈనాటికి మనకు అర్థము కానటువంటి విషయమే. నేను క్రైస్తవునిగా మారినప్పటినుండి అనేకులైన దైవజనులు బోధలు విన్నాను కాని వారి బోధలో జెకర్యాను గూర్చిన బోధను నేను వినలేదనే చెప్పవచ్చును. నా ఈ క్రైస్తవ జీవితములో జెకర్యా ప్రవచనములోని వాక్యము అను దైవసేవకుల బోధలో అత్యంత తక్కువ సార్లు వినుట జరిగింది. ఈ పుస్తకము వ్రాయుట మొదలు పెట్టినప్పుడు నాలో జెకర్యా ఒక గొప్ప దైవ ప్రత్యక్షత కలిగిన ప్రవక్త అని నేను గుర్తించితిని. ఇలాంటి ప్రవక్త 14 అధ్యాయములు కలిగిన ఒక గ్రంథమును రచించుట జరిగింది. జెకర్యాయొక్క కాలము :- జెకర్యా దర్యావేషు రాజుయొక్క కాలము నాటివాడు. బైబిలు చరిత్ర ఆధారముగా ఈ జెకర్యా సుమారు క్రీస్తు పూర్వము 500 - 510 సంవత్సరముల క్రితమువాడు. జెకర్యాయొక్క వంశావళి :- జెకర్యా 1:1 ప్రకారము ఈ జెకర్యా బెరక్యాయొక్క కుమారుడు. ఈ బెరక్యా ఇద్దోకునకు పుట్టినవాడు. అనగా జెకర్యాయొక్క తాత ఇద్దోకు అని మనము చెప్పవచ్చును. జెకర్యాయొక్క దర్శనములు :- ఈ పుస్తకములో ఈ దర్శనములు సంపూర్ణముగా వివరించుట జరిగింది. ఈ దర్శనములు కొన్ని మాత్రమే అయినను దీనిలో చాలా ఆత్మీయ అర్థములు కలిగియున్నట్లుగా మీరును ఈ పుస్తకము చదివి గ్రహించగలరు. జెకర్యా ఒక హతసాక్షి :- జెకర్యా ప్రవక్తలలో అగ్రగణ్యుడైన లేక హతసాక్షులలో అగ్రగణ్యుడైన క్రీస్తుకు ముందు చంపబడి మరణించినవాడు. క్రీస్తు ప్రభువు ప్రవక్తలలో చివరివాడు కనుక ఒక గొప్ప ప్రవక్తగా ఈ లోకములో నూతన నిబంధనను ఏర్పరచుట జరిగింది. జరగబోవు ప్రత్యక్షతలు ఎన్నో ముందుగా ప్రవచించుట జరిగింది. ప్రవక్త ఎన్ని విధములుగా యోగ్యతను కలిగియుండునో అందరికన్నా ఎక్కువ యోగ్యతను క్రీస్తు ప్రభువు ఈ లోకరీత్యా కలిగియుండెను. అలాగే క్రీస్తు ప్రభువు సాధారణ మరణమును పొందినవాడు కాదు. తన 33 1/2 సంవత్సర కాలము తరువాత యూదులు సిలువపై దారుణముగా క్రీస్తు ప్రభువుని చంపుట జరిగింది. సీలలు చేతులకు కాళ్ళకు కొట్టి ముళ్ళ కిరీటము ద్వారా రక్తమును నేలపై చిందింపజేసి చంపుట జరిగింది. అంతేకాకుండా యూదులు క్రీస్తు ప్రక్కలో బల్లెముతో పొడిచి చనిపోయినట్లుగా నిర్థారించుకొన్నారు. ఇది హత్యయే కదా! కనుక హతసాక్షులో అగ్రగణ్యుడు క్రీస్తు ప్రభువే, ఎందుకంటే ఏ తప్పు చేయని వాడుగా తన శరీరమును బలిగా సిలువపై అర్పించుట జరిగింది. కనుక హేబెలుతో మొదలై క్రీస్తుతో పాత నిబంధనలోని ప్రవక్తల బలి సంపూర్తియైనట్లుగా మనము గ్రహించాలి. అయితే జెకర్యా కూడా హతసాక్షుల వలె చంపబడినవాడు. కాని క్రీస్తుకు కొంచెము ముందు చంపబడినవాడు. అనగా జెకర్యా తరువాత క్రీస్తు ప్రభువే హతసాక్షి అవుట జరిగింది. ఇదే విషయమును క్రీస్తు ప్రభువు చెప్పుట జరిగింది. మత్తయి 23:35, ''నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠము నకును, దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును.'' ఈ విధముగా క్రీస్తు ప్రభువే స్వయముగా హేబెలు రక్తమును ప్రస్తావిస్తూనే జెకర్యా చంపబడిన తీరును ప్రస్తావించుట జరిగింది. ఆనాటి ఇశ్రాయేలీయులు ఈ జెకర్యాను బలిపీఠమునకు దేవాలయమునకు మధ్యన చంపుట జరిగింది. అంటే ఈ ఇశ్రాయేలీయులు దేవుని ప్రవక్తలను చంపుటకు ఎంత దారుణమైన చేయ సంసిద్ధులై యున్నట్లుగా మనకు తెలియుచున్నది. ఈ విధముగా క్రీస్తునకు కొంచెము ముందు అనగా 500 సంవత్సరములకు ముందు తన ప్రాణమును బలిగా అర్పించి హతసాక్షిగా మారినవాడు జెకర్యా. జెకర్యాకు క్రీస్తుకు మధ్య హతసాక్షులు లేరు. బాప్తిస్మమిచ్చు యోహాను తల నరకబడి చంపబడినను, ఆయనను చంపుటకు ఉద్దేశ్యము వేరు. దేవుని రాజ్య విస్తరణ కోసరము ఆయన చంపబడలేదు అనగా దైవరాజ్య సువార్త వ్యాప్తి జరువీగట ఇష్టము లేనివారు ఆయనను చంపలేదు. రాజకుమార్తెయొక్క తల్లి చేసిన తప్పును కప్పిపుచ్చుకొనుటకును, పగ తీర్చుకొనుటకును బాప్తిస్మమిచ్చు యోహాను హత్య జరిగింది. ఈ విధముగా జెకర్యా దేవుని రాజ్య సువార్త కార్యక్రమములో ప్రవక్తగా ప్రత్యక్షత కలిగియుండి చివరకు హతసాక్షిగా గతించుట జరిగింది. ఈ విధముగా ఇంత గొప్ప యోగ్యతను పొందిన జెకర్యా ఒక ప్రవక్తగా ఉండగా అనగా తాను హతసాక్షి కాక మునుపు దైవవాక్కు ఆయనకు ప్రత్యక్షమై ఆయనచే వ్రాయించి ఈ చిన్న గ్రంథము నా యీ ఆత్మీయ జీవితములో కొన్ని రహస్యములు నాకు తెలియజేసినది అనుటకు సందేహము లేదు. ఏనాడు ఎప్పుడు వినని రహస్యములు నాకు ఈ గ్రంథము ద్వారా దేవుడు తెలియజేయుట జరిగింది. ఈ రహస్యములను ఇప్పుడు మీ ముందు పుస్తక రూపములో ఉంచుచున్నాను. కనుక పాఠకులు ఈ చిన్న పుస్తకమును చదివి ఆత్మీయ ఉన్నతిని పొందమని ప్రభువు నామములో మిమ్మును అడుగుచున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీకు తోడై యుండునుగాక!